ఉగ్రదాడి లో బలైన మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటాము - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు జి.సతీష్ రెడ్డి
ఉగ్రదాడి లో బలైన మధుసూదన్ కుటుంబానికి అండగా ఉంటామని, సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు జి.సతీష్ రెడ్డి తెలిపారు. ఉగ్రదాడిలో బలైన సోమిశెట్టి మధుసూదన్ కుటుంబాన్ని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తో కలిసి శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి ఎల్లప్పుడూ మధుసూదన్ కుటుంబ యోగ క్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారని తెలిపారు. నేను కూడా దాడి సంఘటన, వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని వారికి ధైర్యం తెలపడం జరిగిందన్నారు. గత కొద్ది రోజులుగా అందరూ కూడా ప్రభుత్వం నుంచి వస్తూ ఉన్నారని, మంత్రులు వచ్చి వెళ్లడం కూడా జరిగిందని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఇక్కడే ఉండి అన్ని విషయాలు చూసుకుంటున్నారన్నారు.
వైద్యులను నిరంతరం వారికి అందుబాటులో ఉంచుతూ, వారి ఆరోగ్యం పై శ్రద్ద పెట్టడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఏ రకమైనటువంటి సహాయం కావాలి, ప్రభుత్వంతో మాట్లాడి ఎలాంటివి చేయొచ్చు అనేటువంటివి చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుండి అందవలసిన అన్నీ సహాయ సహకారాలు ప్రభుత్వం నుండి అందేలా చూస్తామని తెలిపారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ మధుసూదనరావు మరణం కావలి పట్టణానికి సోకాన్ని మిగిల్చిందన్నారు. ఆ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలో ఆ విధంగా తప్పకుండా ఆదుకోవడం జరుగుతుందన్నారు. వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. మధుసూదన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు.